
కోటప్పకొండ పర్యాటక కేంద్రంగా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా వనరుల్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. కొండపైకి రోప్‌వే (తీగ మార్గం) నిర్మించాలని, అధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆహ్వానించాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయింది. అప్పుడు వేసిన పునాదులు ఇప్పటికీ వెక్కిరిస్తున్నాయి. అప్పటి నుంచి ఒక్క ఇటుక పడితే ఒట్టు.. ఎక్కడ వేసిన పునాది.. అక్కడే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచింది.
కోటప్పకొండపై త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం కొండపైకి తీగ మార్గం నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రూపొందించారు. 2016లో తీగ మార్గం(రోప్‌వే) పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్లతో పనులు చేపట్టే బాధ్యత కోల్‌కతాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ తీగ మార్గం పనులు ప్రారంభించింది. కొండ దిగువన రోప్‌వే కోసం అవసరమైన నిర్మాణ పనులు మొదలుపెట్టింది. తీగ మార్గం ఏర్పాటు చేసే ప్రాంతంలో హోటల్, లేజర్ షో, బోటు షికార్ చేసేలా 2019లో పనులు ప్రారంభించారు. ఇందుకోసం రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో తీగ మార్గాన్ని 2020లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరు చేయకపోవడం, పర్యాటకశాఖకు తప్ప తమకు సంబంధం అని ఆలయ అధికారులు వదిలేయడంతో అడుగు ముందుకుపడలేదు.

దిమ్మెలకే పరిమితం..: పర్యాటకంగా కోటప్పకొండ రాష్ట్రంలోనే దీటుగా ఉండాలని రోప్‌వేకు శ్రీకారం చుట్టారు. తిరునాళ్ల సమయంలో రోప్‌వే వల్ల ఆదాయం భారీగా రావొచ్చు. ఏటా శివరాత్రికి ఇక్కడకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. అంతటి ఆదాయం వచ్చే వనరును ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. పర్యాటకానికి ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందో ఇదే నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఏటా తిరునాళ్లకు వచ్చే భక్తులు ఈ దిమ్మెలను చూసి రోప్‌వే ఎప్పుడు నిర్మిస్తారోనని నిట్టూరుస్తున్నారు. రూ.4 కోట్లతో చేపట్టిన రోప్‌వే పనులు దిమ్మెల నిర్మాణానికి పరిమితమైంది. లేజర్‌షో కోసం నిర్మించిన కట్టడాలు నిరుపయోగంగా మారాయి. హోటల్ భవన తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నడక మార్గం, లేజర్‌షో భవనాలు మధ్యలో పిచ్చిచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి.





