
సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో టీటీడీ ముందంజలో ఉందని వ్యాసరాజమఠాధిపతి విద్యాశ్రీశతీర్థస్వామి అభిప్రాయపడ్డారు. తిరుమలలోని ఆస్థానమండపంలో సనాతన ధార్మిక సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమయ్యింది. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం 25 మంది పీఠాధి, మఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. విద్యాశ్రీశతీర్థస్వామి మాట్లాడుతూ అఖండ సుందరకాండ, గీతాపారాయణం వంటి కార్యక్రమాలతో యువతలో భక్తిని పునరుజ్జీవింపజేసేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. శుశ్రతానంద మాత మాట్లాడుతూ.. సనాతన హిందూ ధర్మప్రచారం కోసం చేస్తున్న టీటీడీ కార్యక్రమాలు ప్రతి మూలకూ చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ గోసంరక్షణ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయన్నారు. గుంటూరుకు చెందిన శైవక్షేత్రం శివస్వామి మాట్లాడుతూ.. గోసంరక్షణలో భాగంగా ప్రతి జిల్లాలో గోశాలలు ఏర్పాటు చేయాలని, గురుకుల పాఠశాలలను విస్తరింపజేయాలన్నారు. ఆలయాల్లో అన్యమతస్థులను తొలగించాలని సూచించారు.





