News

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్‌

248views

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారతదేశం తిరుగులేని శక్తిగా నిలవడానికి సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ ఉపయోగపడుతుందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కోల్‌కతాలో తయారుచేసిన ఈ నౌకను విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ, భారత నౌకాదళం దేశానికి రక్షణ కల్పించే స్థాయి నుంచి మిత్రదేశాలకు సాయం అందించే స్థాయికి ఎదిగిందన్నారు. హిందూ మహాసముద్రం మీదుగానే అత్యధికంగా ప్రపంచ వ్యాపారం జరుగుతుందని, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడంతో పాటు స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత నేవీపై ఉందని పేర్కొన్నారు. ఈ రెండు విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇటీవల సముద్రపు దొంగలు బ్రిటిష్‌ నౌకపై డ్రోన్‌తో దాడి చేసినప్పుడు ఆయిల్‌ ట్యాంకర్లకు నష్టం జరగకుండా నేవీ సాయపడిందన్నారు. ఈ కార్యక్రమంలో భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌, సంధాయక్‌ కమాండర్‌, కోల్‌కతా షిప్‌యార్డ్‌ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

‘సంధాయక్‌’ అంటే ప్రత్యేక పరిశోధక శక్తి

‘సంధాయక్‌’ అంటే ప్రత్యేక పరిశోధక శక్తి అని అర్ధం. పోర్టులు, హార్బర్లు, తీరప్రాంతాలు, లోతైన సముద్రాల గుండా నౌకలు ప్రయాణించడానికి అనువైన, సురక్షితమైన మార్గాలను సూచించడం దీని విధి. సముద్రం కిందన ఉండే కొత్త అంశాలను హైడ్రోగ్రాఫిక్‌ సర్వే ద్వారా వెలుగులోకి తీసుకువస్తుంది. నౌకలు ప్రయాణించే మార్గంలో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నట్టయితే అప్రమత్తం చేస్తుంది.ఈ తరహా సర్వే నౌకలు నాలుగు తయారు చేస్తుండగా అందులో మొదటిది ఇది. దీని బరువు 3,400 టన్నులు. 16 మీటర్ల బీమ్‌తో 110 మీటర్ల పొడవున నిర్మించారు. అత్యాఽధునిక హైడ్రోగ్రాఫిక్‌ పరికరాలు అమర్చారు. రెండు డీజిల్‌ ఇంజన్లు ఉంటాయి. గంటకు 18 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

జాతీయ సముద్ర శక్తిగా ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌: నేవీ చీఫ్‌

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సర్వే నౌక ఐఎన్‌ఎ్‌స సంధాయక్‌ను జాతీయ సముద్రశక్తిగా భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ అభివర్ణించారు. అత్యవసర సమయాల్లో ఈ నౌక సముద్రంలో ఆస్పత్రిగా కూడా ఉపయోగపడుతుందని వివరించారు. కాగా.. మాల్దీవులతో ఇటీవల పొడచూపిన విభేదాల ప్రభావం నేవీపై ఏమీ లేదని ఆయన స్పష్టంచేశారు. ఇరు దేశాల మధ్య రక్షణపరంగా చక్కటి అవగాహన ఉందన్నారు. డిసెంబరు 2022లో తీసుకువచ్చిన యాంటీ పైరసీ చట్టం నేవీకి ఎంతో శక్తినిచ్చిందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం నేవీ ఎటువంటి శక్తినైనా ఢీకొట్టడానికి సదా సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఇటీవల కాలంలో సముద్రపు దొంగల బెడద అధికమైందని, ఇప్పటివరకు వారి నుంచి ఐదు నౌకలను, అందులో 80 మందిని కాపాడామని తెలిపారు.

మిలాన్‌కు 46 దేశాల ప్రతినిధులు

ఈ నెల 19 నుంచి విశాఖపట్నంలో జరగనున్న మిలాన్‌ కార్యక్రమానికి 46 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ తెలిపారు. ఇందులో భారతదేశం తరఫున రెండు యుద్ధ విమాన వాహక నౌకలు పాల్గొంటాయన్నారు. మిలాన్‌ వల్ల భారతదేశంతో పాటు విశాఖ నగరానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. నేవీలో ఇప్పుడు లింగ భేదం లేదని, శక్తిసామర్థ్యాలు కలిగిన మహిళలకు అన్ని కేడర్లలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.