
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం రెడ్డిపాలెం గ్రామంలో సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు జన్మించిన ధైర్యశాలి గాదె చిన్నపరెడ్డి. బాల్యంనుండి గుర్రపుస్వారీ, కర్రసాములలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. 1907లో మద్రాస్ సంతకు వెళ్ళినప్పుడు అక్కడ విన్న తిలక్ ఉపన్యాసం చిన్నపరెడ్డిలో దేశభక్తిని రగిలించింది. ఆతరువాత ప్రభుత్వం పెంచిన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమంచేపట్టాడు.
1909 ఫిబ్రవరి 18న పెద్దప్రభను తనఎడ్లబండిపై అలంకరించుకొని ప్రసిద్ధ శైవపుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు తన అనుచరులతో ఊరేగింపుగా వెళ్లాడు. అక్కడి జనసందోహమునకు ఇతని ఎడ్లు బెదిరి అదుపుతప్పాయి. అక్కడ ఉన్న పోలీసులు క్రూరంగా జరిపిన కాల్పల్లో చిన్నపరెడ్డి యొక్క ఒక ఎద్దు చనిపోయినది. తను అత్యంత ప్రేమతో చూసుకునే ఎద్దును చంపటంతో.. చిన్నపరెడ్డి మరియు అతని భాష అనుచరులు పోలీసులపై తిరగబడ్డారు. విచక్షణా రహితంగా పోలీసులు జరిపినలాఠీచార్జికి అక్కడ ఉన్న స్త్రీ, పురుషులు చేతికి అందిన కర్రలను, ఇనపగొట్టాలను తీసుకొని పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు, ఇద్దరు పోలీసులు మృతిచెందారు.
చిన్నపరెడ్డిని అతని అనుచరులను సుబ్బారెడ్డి అరెస్టుచేసి అక్కడనుండి తరలించే సమయంలో ప్రజలు పెద్దఎత్తున వందేమాతరం అంటూ స్వరాజ్యం మా జన్మహక్కంటూ నినదించారు. పరిస్థితిని అదుపుచేయనందుకు, ఇద్దరు పోలీసుల మరణానికి కారణమని భావిస్తూ డిప్యూటీ కలెక్టర్ ని విధులనుండి తొలగించారు. చిన్నపరెడ్డిని అతని అనుచరులను రాజమండ్రి జైలుకు తరలించారు. మొత్తం అరెస్ట్ అయిన వారిలో 21 మందికి ద్వీపాంతరవాసశిక్ష, చిన్నపరెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ 1910 ఆగస్టు 13న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి మ్యాన్రో తీర్పు ఇచ్చాడు. చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడుతూ దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి ప్రాణత్యాగం చేశాడు ఇప్పటికీ ఆయన త్యాగాన్ని దేశభక్తిని ప్రజలు గుర్తు చేసుకుంటూ సై సైరా చిన్నపరెడ్డి- నీపేరే బంగారపుకడ్డి.. అంటూ పాటలు, బుర్రకథల రూపంలో వారి వీరగాధను గుంటూరు జిల్లాలో చెప్పుకుంటుంటారు.





