
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఫత్వా జారీ అయిందని ‘అఖిల భారత ఇమామ్ ఆర్గనైజేషన్’ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసి పేర్కొన్నారు. ఈనెల 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసికి సైతం ఆహ్వానాలు అందాయి. దీంతో ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇల్‌యాసి హాజరయ్యారు.
ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్య రామమందిరానికి వెళ్లినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఒకవర్గం దూషణకు దిగినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందన్నారు. ‘‘నా ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో ఉంచి అన్ని మసీదు అథారిటీలకు, ఇమామ్‌లకు చేరవేశారు, నన్ను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారు. నేను క్షమాపణ చెప్పాలని, అలానే నా పదవి నుంచి వైదొలగాలని అందులో ఉంది. ఫత్వా జారీచేయడానికి కారణం వారికి మాత్రమే తెలుసు. నాకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపింది. నేను దానికి అంగీకరించాను. ఆ వేడుకకు వెళ్లాలా? వద్దా? అని రెండు రోజులు ఆలోచించాను. ఎందుకంటే నా జీవితంలోనే అదే అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మతసామరస్యం, దేశ మంచి కోసం, జాతి ప్రయోజనాల దృష్ట్యా అయోధ్యకు వెళ్లాను.
నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు
నాకు అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. సాధువులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్టు నా నిర్ణయాన్ని స్వాగతించింది. నేను ప్రేమను పంచడానికి అక్కడికి వెళ్లాను. అది నెరవేరింది. మన ప్రార్థనలు, ఆచారాలు, మతం, కులం, విశ్వాసాలు వేర్వేరు కావచ్చు. కానీ మన అతిపెద్ద మతం మానవత్వం. నేను ఎలాంటి తప్పుచేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే అవసరం లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు. ఇది భిన్నత్వంలో ఏకత్వం గల ‘సర్వ ధర్మ సంభవ్’ భారత్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. చంద్రుడిపై భారత్ కాలు మోపింది. విశ్వగురు కావడానికి చేస్తున్న ప్రయాణంలో మనమంతా ఒకటిగా, బలంగా ఉండాలి. ఇది అందరి భారత్. అందుకే ఇది గొప్పదేశం’’ అని ఇల్‌యాసి పేర్కొన్నారు.





