News

పూరీ రథాలను లాగేందుకు తాళ్లు వేటితో తయారు చేస్తారు?

26views

మరికొద్ది రోజుల్లోనే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మూడు అద్భుతమైన రథాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దేశంలోని అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన పూరీ రథయాత్రను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన తాళ్లు (రోప్స్), ఆధునీకరించిన బ్రేకింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుని రథయాత్ర సమయంలో ఈ తాళ్లను, బ్రేకింగ్ వ్యవస్థను ఎలా ఉపయోగిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రథాలు లాగడం కోసం రోప్స్
పూరీ జగన్నాథుని రథయాత్ర సమయంలో రథాలను లాగడానికి ఉపయోగించే తాళ్లు సాధారణమైనవి కావు. వీటిని లక్షలాది భక్తులు లాగేటప్పుడు తెగిపోకుండా ఉండేలా ప్రత్యేకంగా తయారుచేస్తారు. రథాలను లాగుతున్నప్పుడు అవి తెగిపోకుండా ఉండేలా వాటి దృఢత్వాన్ని జాగ్రత్తగా పరీక్షిస్తారు. ఈ తాళ్లను ఒడిశా కాయిర్ కార్పొరేషన్ తయారుచేసి జగన్నాథుని ఆలయ పరిపాలన విభాగానికి సరఫరా చేస్తుంది. ప్రతి తాడు 220 అడుగుల పొడవు ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా నందిఘోష, తాళధ్వజ, దర్పదలన అనే మూడు రథాల కోసం రెండు పూర్తి సెట్ల తాళ్లను సిద్ధం చేశారు.

ప్రతి రథాన్ని లాగడానికి నాలుగు ప్రధాన తాళ్లు అవసరం అవుతాయి. అదనంగా మరో రెండు తాళ్లను ఉంచుతారు. మూడు రథాలకు మొత్తం 18 తాళ్లు అవసరమైనప్పటికీ తగినంత బ్యాకప్, భద్రత కోసం ఈ ఏడాది 28 తాళ్లను సిద్ధంగా ఉంటారు. వాటిని జగన్నాథుని ఆలయ పరిపాలన కార్యాలయంలో భద్రపర్చారు. నిర్మాణ పనులు పూర్తైన తర్వాత ఈ తాళ్లను రథాలకు అమర్చుతారు. నేత్రోత్సవం కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అధిక నాణ్యత గల కొబ్బరి పీచుతో ఈ తాళ్లను తయారుచేస్తారు. వీటిని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల రథాలకు కట్టిన తర్వాత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ ఈ తాళ్లను తాకడాన్ని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు. రథయాత్రలో పాల్గొనడాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు.

రథాల బ్రేకింగ్ వ్యవస్థ
కాగా, పూరీ జగన్నాథుని మూడు రథాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. రథయాత్ర సమయంలో ఈ భారీ రథాలను నియంత్రించడానికి, ఆపడానికి ఉపయోగపడే సంప్రదాయ చెక్క బ్రేకింగ్ వ్యవస్థను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. ఈ బ్రేకింగ్ వ్యవస్థలో ప్రతి రథం ముందు భాగం నుంచి తాళ్లతో వేలాడదీసిన 20 అడుగుల పొడవైన చెక్క దూలం ఉంటుంది. రథం ఆగాల్సి వచ్చినప్పుడు లేదా మలుపు తిరగాల్సి వచ్చినప్పుడు చక్రాల ముందు దూలాన్ని కిందికి దించుతారు. చక్రాలు ఆ దూలం మీదకు ఎక్కగానే రథం కదలిక అదుపులోకి వస్తుంది. ఈ ఏడాది మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన నైలాన్-రబ్బర్ బెల్టులతో బ్రేకింగ్ వ్యవస్థను ఉన్నతీకరించారు. ఈ బెల్టులకు ప్రత్యేకమైన, దృఢమైన మేకులను బిగించారు. ఇవి రోడ్డు ఉపరితలంతో ఎక్కువ ఘర్షణను సృష్టించి బ్రేకులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి.

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారని బలరాముడి కోసం ఉపయోగించే తలధ్వజ రథం నిర్మాణ పర్యవేక్షకుడు, ప్రధాన సేవకుడు బాలకృష్ణ మహారాణా తెలిపారు. సుమారు 20 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు ఉన్న ఒక దృఢమైన చెక్క బ్రేకును రథం ముందు భాగంలో వేలాడదీసి, దానిని భోయ్ సేవకులు నడుపుతారని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు తాళ్ల సహాయంతో బ్రేకును కిందికి దించుతారని వెల్లడించారు. దీంతో రథ చక్రాలు ఆ చెక్క దూలానికి తగిలి ఆగిపోతాయని పేర్కొన్నారు. “ఒడిశా కాయిర్ కార్పొరేషన్ ప్రతి ఏటా పవిత్రమైన రథపు తాళ్లను సరఫరా చేస్తుంది. గతంలో ఈ తాళ్లను కేరళ నుంచి తెప్పించేవారు. అవి నాసిరకంగా ఉండేవి. అప్పుడప్పుడు తెగిపోయేవి. మరింత భద్రత కోసం శ్రేష్ఠమైన కొబ్బరి పీచును ఉపయోగించి స్థానికంగా తయారుచేసిన తాళ్లను రథాలను లాగేందుకు వాడుతున్నాం” అని బాలకృష్ణ వివరించారు.