ArticlesNews

గాంధీజీ ఆశయాలు సంఘ్ తో సజీవం

340views

(జనవరి 30 – గాంధీజీ వర్ధంతి)

ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచార వ్యవహారాలు, భాషాభేదాలు..అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన శక్తి. దాని కోసం ఆయన పడిన కష్టాలు, పాటించిన విలువలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయుడి వర్థంతి నేడు.

గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని అభిమానించేవాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. గాంధీ వారసత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కొనసాగిస్తోంది. జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తరచుగా హిందువునని ప్రకటించుకున్నారు. సనాతన హిందూ మతాన్ని తన జీవితానికి ప్రేరణగా భావించారు. సనాతనం అనేది ఈ భరతవర్ష భూమిలో ఉద్భవించిన మానవజాతి యొక్క సర్వవ్యాప్త, శాశ్వతమైన మరియు సార్వత్రిక విలువల సమితి అని హరిజన్‌లోని కథనాలలో గాంధీజీ పేర్కొన్నారు. హిందుత్వం, గోసంరక్షణ, స్వదేశీ, అంటరానితనం నిర్మూలనలపై గాంధీజీ ఆలోచనలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదటినుంచి ముందుకు తీసుకెళుతోంది. నిజానికి మహాత్మాగాంధీ సంఘ్ యొక్క గొప్ప ఆరాధకులలో ఒకరు. 1934లో గాంధీజీ మహారాష్ట్రలోని వార్ధాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని కులాలకు చెందిన యువకులు, బాలురు ఒకే పైకప్పు క్రింద కుల పట్టింపులు లేకుండా కలిసి ఉంటూ భోజనం చేయడం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక నెల తరువాత 1947 సెప్టెంబర్ 16న ఢిల్లీలో గాంధీజీ ఒక ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ, ‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ హెడ్గేవార్ జీవించి ఉన్నప్పుడు నేను ‘ఆర్‌ఎస్‌ఎస్’ శిబిరాన్ని సందర్శించాను. మీ క్రమశిక్షణ, అంటరానితనం మచ్చుకైనా లేకపోవడం, ఎటువంటి డాంభికాలులేని శ్రద్ధా నిరాడంబరత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి,’’ అని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను చూసిననాటి నుండి నేటి వరకు సంఘ్ దినదినాభివృద్ధి సాధిస్తూ వచ్చిందని, సేవ మరియు స్వయంత్యాగం యొక్క ఉన్నత ఆదర్శంతో ప్రేరణ పొందిన ఏ సంస్థ అయినా వృద్ధి సాధిస్తుందని తాను బలంగా విశ్వసిస్తానని గాంధీ చెప్పుకొచ్చారు. ఇక యాదృచ్ఛికంగా మహాత్మాగాంధీ ప్రతిపాదించిన సూత్రాలను పొందుపరిచిన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కూడా 1939లో పూణేలోని సంఘ్ శిక్షా వర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్‌ను ‘ఇక్కడ ఎవరైనా అంటరానివారు ఉన్నారా’ అని అంబేద్కర్ అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ, ఇక్కడ తాకదగినవారు, అంటరానివారు లేరని, కేవలం హిందువులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇతరుల కులాన్ని కూడా పట్టించుకోకుండా స్వయంసేవకులు సంపూర్ణ సమానత్వం మరియు సోదరభావంతో మెలగడాన్ని చూసి అంబేద్కర్ ఆశ్చర్యపోయారు.

గాంధీజీ మరియు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇద్దరూ ఒకేరకమైన భావసారూప్యం కలిగి ఉన్నారని ప్రఖ్యాత రచయిత డాక్టర్ వాల్టర్ ఆండర్సన్ విశదీకరించారు. గాంధీజీ ఆకర్షణీయమైన విజ్ఞప్తి కాంగ్రెస్‌ను స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర వహించేటట్లు చేస్తే..ఉపాధ్యాయ కూడా సాధువు తరహా పాత్ర కలిగి ఉండి..జనసంఘ్ కేడర్‌పై ఆ స్థాయి ప్రభావాన్ని కలిగించారని ఆండర్సన్ తన ‘టూ సీర్స్’ వ్యాసంలో పొందుపరిచారు. ఇద్దరిని పదునైన ఆలోచనలతో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన మేధావులుగా అభివర్ణించారు. ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం’ గురించి ప్రస్తావిస్తూ, గాంధీ ‘స్వరాజ్య’, ‘స్వదేశీ’లకు అత్యంత మద్దతుదారుడిగా ఉపాధ్యాయను కొనియాడారు. అలాగే, మహాత్మా, దీనదయాళ్ ఇద్దరూ…రాజకీయ అధికారం ప్రజారంగంలోని వ్యక్తులపై అవనీతి ప్రభావాన్ని చూపుతుందని అనుమానించారు. అందుకే వారిద్దరూ ఏ రాజకీయ పదవిని నిర్వహించలేదని, అలా చేయాలని కోరుకోలేదని అండర్సన్ తన వ్యాసంలో రాసుకొచ్చారు.

సమాజంలోని స్త్రీ, పరుషుల వ్యక్తిత్వమే అంతిమంగా రాజ్య స్వభావాన్ని నిర్ణయిస్తుందని గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ విశ్వసించారు. అలాంటి స్త్రీ పురుషులను తయారు చేసే పనిని గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్విరామంగా నిర్వహిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు వ్యతిరేకంగా గాంధీజీని తప్పుదారి పట్టించేందుకు ఏకీకృత ద్వేషపూరిత ప్రయత్నాలు చేసినప్పటికీ, సంఘ్ ఆదర్శాలపై తన బలమైన నమ్మకాన్ని గాంధీజీ గట్టిగా పునరుద్ఘాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థీకృతమైన క్రమశిక్షణ కలిగిన సంస్థ అని అందువల్ల దాని బలాన్ని భారతదేశ ప్రయోజనాల కోసం తీవ్రంగా ఉపయోగించవచ్చని గాంధీజీ కొనియాడారు. కాంగ్రెస్ అహింసాయుతంగా పాలించినంత కాలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు కూడా శాంతియుతంగా ఉంటారని గాంధీజీ తన అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

గాంధీజీ జనవరి 18, 1948న ఢిల్లీలో హిందువులు మరియు ముస్లింల మధ్య సోదరభావం కోసం ప్రయత్నిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే..ఏడు అంశాల ఒప్పందంపై హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకులు సంతకం చేసి ఆయన నిరాహార దీక్షను విరమింపజేశారు. నిజానికి, 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించిన పరమపూజనీయ హెడ్గేవార్‌తో మహాత్మాగాంధీ పరిచయాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో గుర్తించవచ్చు. గాంధీజీ జైలు శిక్షకు ప్రతిస్పందనగా 1922లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించినప్పుడు, ఆ ర్యాలీని ఉద్దేశించి హెడ్గేవార్ ప్రసంగించారు. మహాత్మా గాంధీ మాటలకు, చర్యలకు తేడా లేదని ప్రకటించారు. గాంధీజీని ‘పవిత్రమైన ఆత్మ’గా గుర్తించడమే కాకుండా తన ఆశయాల కోసం సర్వస్వం త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తి అని హెడ్గేవార్ ప్రశంసించారు. కాబట్టి మహాత్ముని వారసత్వానికి నిజమైన వారసులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, దాని సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు..