
అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. ఈ మేరకు భారత నేవీ వెల్లడించింది.
సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక.. ఓడను అడ్డగించి, బందీలను విడిపించింది.
కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్‌ను సోమాలియా దొంగలు అపహరించారు. రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత్ నౌకాదళానికి అత్యవసర సందేశం అందింది. ఐఎన్‌ఎస్ సుమిత్ర, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి.. 17 మంది మత్స్యకారులను రక్షించిన సంగతి తెలిసిందే.
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించిన భారత నేవీ.. సమీపంలోని ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి, సహాయ చర్యలు చేపట్టింది.





