
భారత జాతీయ చిహ్నం ధైర్యం, శక్తి, విశ్వాసం, నమ్మకం, నీతి, ధర్మం, సమానత్వంలకు ప్రతీక అని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని త్రికోణ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ జాతీయ చిహ్నాన్ని కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ సుందరీకరణలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచేందుకు సుందరీకరిస్తున్నామన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ చిహ్నాన్ని ఆవిష్కరించటం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. 1950 జనవరి 26వ తేదీన సార్‌నాథ్‌లోని అశోకుని ధర్మస్తూపం నుంచి దీనిని స్వీకరించారని ఈ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో పెద్ది రోజా, ఆర్డీవో ఎం. వాణి, కలెక్టరేట్ ఏవో ఏఎస్‌ఎన్ రాధిక తదితరులు పాల్గొన్నారు.





