
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతుండగా.. అక్కడికి 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్‌లోని అయుత్తయ్య నగరంలోనూ ఉత్సవ కోలాహలం మొదలైంది. స్థానిక చవో ఫ్రయ, లోప్ బురి, పా సక్ నదుల జలంతో కూడిన పాత్రలు, అయుత్తయ్య నగరం నుంచి మట్టి ఇప్పటికే భారత్‌లోని అయోధ్యకు చేరాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 70 కిలోమీటర్ల దూరంలో చవో ఫ్రయ నది ఒడ్డున వెలసిన అయుత్తయ్య యునెస్కో వారసత్వ నగరాల జాబితాలో ఉంది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయుత్తయ్యతోపాటు ఇతర థాయ్ నగరాల్లోని ఆలయాల్లో దీపోత్సవాలు, రామ భజనలు జరుగుతాయని బ్యాంకాక్ వీహెచ్‌పీ విభాగం తెలిపింది. థాయ్ ఆలయాల్లో విశాలమైన తెరలను ఏర్పాటుచేసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శించనున్నారు. అయుత్తయ్య మొట్టమొదటి రాజు రామతీబోది తన నగరానికి అయోధ్య పేరిట అయుత్తయ్య అని నామకరణం చేశారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ అధ్యక్షుడు స్వామీ విజ్ఞానంద తెలిపారు. ఈ ప్రాంతంపై రామాయణ ప్రభావానికి అది ప్రతీక అని, తరవాత వచ్చిన రాజులందరూ రామ నామాన్ని ధరించారని వివరించారు.





