
నెల్లూరు జిల్లా పొదలకూరుపాడుకు అయోధ్య రామయ్య అక్షింతలుచేరుకున్నాయి. అక్షింతలకు స్వాగతం పలికేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తలపై అక్షింతలు పెట్టుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అయోధ్య రామయ్య అక్షింతలు మోసేందుకు ఎంతో పుణ్యం చేసుకున్నామని భక్తులన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యకార్యమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి 5 గ్రాముల అక్షింతలు ఇవ్వాలని, వాటికి ఇంటిలో తయారు చేసిన అక్షింతలు కలిపి వృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. 22 జనవరి రోజున అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట జరుగుతుందని, ప్రతీ ఇంటి వద్ద వివరించాలని సూచించారు. అదే సమయంలో సమీపంలోని ఆలయంలోగాని, టీవీ ద్వారా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. 22న ఇంటిల్లపాది స్నానాలు ముగించుకుని అక్షింతలు నెత్తిపై జల్లుకోవచ్చని, పిల్లలు, చిన్నవారిని దీవించడం, భర్త ఆశీస్సులు, దీవెనలు పొందడం, బీరువాలోని లక్ష్మీస్థానంలో అక్షింతలు ఉంచుకోవడం, పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభకార్యాల్లో ఈ అక్షింతలను వినియోగించవచ్చని తెలిపారు.





