News

శ్రీశైలక్షేత్రంలో రూ.215.04 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

293views

శ్రీశైలక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ చక్రపాణిరెడ్డితో కలిసి ఆయన బుధవారం శ్రీశైల మహాక్షేత్రంలో రూ.215.04 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా గంగాధర మండపం వద్ద స్వామిఅమ్మవార్ల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాలు మండప నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు.

అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రూ.1,600 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. గతంలో సాలు మండపాలు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారన్నారు. ప్రస్తుతం సాలు మండపాలను నిర్మించడం సంతోషకరమన్నారు. క్షేత్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 150 మంది క్యాడర్‌స్ట్రెంత్‌కు అనుమతులు ఇచ్చామని, దేవస్థానంలో పనిచేసే ప్రతి కార్మికుడికి సమాన వేతనం ఇస్తామని, త్వరలోనే ధర్మప్రచార మాసోత్సవాలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మంత్రి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌, సభ్యులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. క్షేత్రంలో అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టామన్నారు. ఇప్పటికే రూ.90 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, మరో రూ.215.04 కోట్లతో పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. మొత్తం రూ.300 కోట్లు క్షేత్రంలో అభివృద్ధి పనులకు కేటాయించినట్లు చెప్పారు.