రాష్ట్రంలో అన్యమతం ప్రచారం చేసే వారి నుండి హైందవులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మతమార్పిడి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తునే ఉన్నాయి. క్రైస్తవ మత మార్పిడి మిషనరీలకు వ్యతిరేకంగా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం చింతపల్లి గ్రామంలో మత మార్పిడి ఘటన చోటు చేసుకుంది. అయితే మత మార్పిడి మాఫియాను స్థానికులు అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చింతపల్లి గ్రామంలో నాలుగు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలు తరచుగా లౌడ్ స్పీకర్లను వినియోగిస్తూ గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై గ్రామస్థులు పలుమార్లు సదరు చర్చీలకు సంబంధించినవారికి ఫిర్యాదు చేసినా..వారు పెడ చెవిన పెట్టారు. ఇక, తాజాగా ఐదవ చర్చి నిర్మాణం కూడా చేపట్టడంతో గ్రామస్థులు కోపోద్రేకులయ్యారు. రాత్రి వేళ్లల్లో సైతం లౌడ్ స్పీకర్లు వినియోగించడంతో గ్రామస్థులతో పాటు పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే మతమార్పిడీలు తమ కుటుంబాలలో, బంధువర్గాల్లో చిచ్చు పెడుతున్నాయని గ్రామస్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఐక్య మత్యంగా ఉన్న తమ కుటుంబాలను క్రైస్తవ మిషనరీలు విచ్ఛిన్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రైస్తవంలోకి మారిన కుటుంబ సభ్యులు తమను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారని, తమ ఇళ్ళల్లో కార్యక్రమాలకు రావాలంటే మతాన్ని సాకుగా చూపుతున్నారని తెలిపారు
నిద్రలేని రాత్రులతో తమ సహనం నశించిందని మత మార్పిడి మాఫియాకు అడ్డుకట్ట వేసి ముగింపు పలకాలని , గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.





