
అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి.9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు.
హైదరాబాద్‌వాసి, అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసశాస్త్రి తన శేష జీవితమంతా అయోధ్య రాముని సేవకే అంకితం అంటున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు. శ్రీరాముడి పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించిన భరతుని స్ఫూర్తితో బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు.

అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా చండూరులో రూ.91 లక్షలతో వీటిని తయారుచేయించారు. 41 రోజులపాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, దేశవ్యాప్తంగా చూపించాలని సంకల్పించారు. రామేశ్వరం, ద్రాక్షారామ, అంతర్వేది, సింహాచలం, విజయవాడ, తిరుమల, శృంగేరి, కంచి, కాశీ తదితర పుణ్యక్షేత్రాలు, మఠాల్లో పాదుకలకు పూజలు, అభిషేకాలు చేయించారు.





