
ప్రజా బాహుళ్యంలో విశ్వాసాల ప్రమేయం పెరిగినప్పుడు, ధార్మికత పాళ్లు ఎక్కువైనప్పుడు వాటిని ధ్వంసం చేసే శక్తులు బయలుదేరతాయి. సనాతనతత్వంపై, హిందూ ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో జరిగిన దుర్మార్గమైన కుట్రే ‘ధర్మస్థల’ వివాదం. గతేడాది జూలైలో సంచలనం సృష్టించిన ‘ధర్మస్థల కేసు’ కొత్త మలుపు తీసుకుంది. ప్రాచీన ఆలయంపై చేసిన తప్పుడు ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందని తేటతెల్లమైంది.
ఆశ్చర్యకరంగా ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పేరు బయటకు వచ్చింది. స్వయాన నిందితుడు చిన్నయ్య జూన్ 6న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మస్థల ఆలయం దుష్ప్రచారం వెనుక రూ.200 కోట్లు చేతులు మారాయని, ఇందులో నటుడు ప్రకాశ్‌రాజ్ పాత్ర ఉందని, ఈ కుట్రకు కేంద్రం కేరళ అని నిందితుడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. అతను ప్రకాశ్‌రాజ్‌తో ఫోన్‌లో సంభాషించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. తాను నిందితుడు చిన్నయ్యతో మాట్లాడినట్టు ప్రకాశ్‌రాజ్ బెంగళూరులో పత్రికా విలేఖరుల సమావేశంలో అంగీకరించారు.
ధర్మస్థల ఆలయంలో అత్యాచారాలు జరిగాయని తాను మీడియా ముందు చెపితే కావాల్సినంత డబ్బు ముడుతుందని కొందరు ప్రేరేపించడం వల్లనే తాను ప్రసార మాధ్యమాల ముందు వెల్లడించానని నిందితుడు చిన్నయ్య న్యాయ స్థానానికి విన్నవించాడు. ‘నువ్వేమీ భయపడకు. నేనున్నాను. నేను నీ వద్దకు వచ్చి..నిన్ను ఆలింగనం చేసుకుంటాను’ అని ప్రకాశ్‌రాజ్ అన్నట్టు కూడా నిందితుడు కోర్టుకు తెలిపాడు. కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత భయపడిన తను, ప్రకాశ్‌రాజ్‌కు ఫోన్ చేశానని, ‘సిట్’ అధికారి నిజాయతీపరుడని, ఆయన వద్దకు వెళ్లవలసిందిగా ప్రకాశ్‌రాజ్ సలహా ఇచ్చాడని నిందితుడు పిటిషన్‌లో వివరించాడు. ఈ కేసులో నాటి కేబినెట్ మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గేపై సైతం ఆరోపణలు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే దేశంలో ప్రాచీన ఆలయ ప్రతిష్ఠను, భక్తుల విశ్వాసాలను గాయపరిచేందుకు చాలా పెద్ద కుట్ర జరుగుతోందని అర్థమవుతుంది.
ప్రకాశ్‌రాజ్ బెంగళూరు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, వీర్ సావర్కర్, ప్రధాని నరేంద్ర మోదీ పేర్లను అనవసరంగా ప్రస్తావించి తన అహంకారాన్ని చాటుకున్నారు. ‘సారీ’ చెప్పడానికి తాను సావర్కర్ కాదని, విలేకరుల సమావేశాలు పెట్టకుండా ఉండటానికి తాను మోదీని కాదంటూ వ్యంగ్య వ్యాఖ్యలతో వాచాలత్వం ప్రదర్శించారు. దీంతో ప్రకాశ్‌రాజ్ విలక్షణ నటుడు కాదు..‘అవలక్షణ’ నటుడని అర్థమైంది.
అవలక్షణ నటుడు గతంలోనూ జుగుప్సాకరంగా స్పందించాడు. ‘దేశంలో కోట్లమంది రాముడిని ఆరాధిస్తారు కదా’ అని ఓ మీడియా వేదికపై అడిగిన ప్రశ్నకు, ‘అశ్లీల చిత్రాలను కూడా చూస్తారు కదా?’ అని గర్వం ప్రదర్శించాడు. మనిషిలో మిగిలిపోయిన అనేక ఆదిమ లక్షణాలలో అహంకారం ఒకటి. అది ప్రకాశ్‌రాజ్‌లో పుష్కలంగా ఉంది. తన అల్పత్వాన్ని, పిపీలకత్వాన్ని బయటపెట్టే ఏ వాస్తవానికైనా మనిషి భయంతో వణికిపోతాడు. ప్రకాశ్‌రాజ్‌లో అది స్పష్టంగా కనిపించింది. లోకాల చీకట్లను పోగొట్టేదే ధార్మిక విశ్వాసం. ప్రజా జీవితంలో ధార్మిక విశ్వాసాలపాలు పెరుగుతున్నప్పుడు.. అడుగడుగునా ఎదురయ్యే కలుపు మొక్కలను నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలి.
‘ధర్మస్థల’ కుట్రను బట్టబయలు చేసి నిందితులెవరైనా, ఎంతటివారైనా శిక్షించడం ప్రభుత్వం, చట్టబద్ధ సంస్థలు అవశ్యం చేయాల్సిన పని. ప్రకాశ్ రాజ్ మాత్రమే కాదు గతంలో అనేక మంది బాలీవుడ్ నటులు, తమిళ నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్ ఒకడుగు ముందుకు వేసి తానొక కుట్రలో భాగస్వామి అయ్యాడు. ఏ భాగస్వామ్యవ• లేకపోతే… నిందితుడితో, విచారణ అధికారితో పదే పదే ఎందుకు సంభాషించినట్టు? అనే అనుమానాలు కలగడం సహజం. విలేకరుల సమావేశంలో ఆయన తడబాటు, తన చర్యల తాలూకు రహస్యాన్ని బట్టబయలు చేసింది.
ధర్మస్థల అంశం దేశాన్ని దిగ్భ్రాంతి పరచింది. ఎంత హిందూ వ్యతిరేకత, సనాతన ధర్మం పట్ల ఏహ్యభావం ఉన్నా.. ఇంత దారుణానికి ఒడిగట్టడం, మనిషి దిగుజారుడు తనానికి నిదర్శనం. కేరళ కేంద్రంగా కుట్ర జరిగిందంటే దీని వెనుక ఎవరున్నారనేది విచారణ సంస్థలు తేల్చాలి. కేరళ క్రైస్తవ మతమార్పిడి సంస్థలకు కేంద్రం. ఐసిస్ వంటి అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్రవాదులకు అడ్డా. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలి. కోట్లాది మంది విశ్వాసాలను గాయపరిచే కుట్రలో కోట్ల రూపాయలు చేతులు మారడం వెనుక ఎవరున్నారో పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా వెలికితీయాలి.
తాను ధర్మస్థల కేసులో నిందితులతో మాట్లాడానని ప్రకాశ్‌రాజ్ స్వయంగా వెల్లడించినా కర్ణాటక ప్రభుత్వం లేదా ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడాన్ని చూస్తే ఇదంతా ఉద్దేశపూర్వక అలక్ష్యమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ తరహా వైఖరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న రాజకీయ వైరాన్ని ఇలా వ్యక్తం చేయడం సముచితం అనిపించుకోదు. ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రభుత్వాల విధి. ధర్మస్థల కేసు విషయంలోనే కాదు, ప్రకాశ్‌రాజ్ అనేక సందర్భాల్లో రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్టు అనేక ఆధారాలు, రుజువులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత అయినా కర్ణాటక ప్రభుత్వం తక్షణమే స్పందించి ‘ధర్మస్థల’ కేసులో చర్యలకు ఉపక్రమించాలి.




