
( డిసెంబర్ 16 – విజయ్ దివస్ )
చరిత్రలో డిసెంబర్ 16 చిరస్మరణీయమైన రోజు. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను సంస్మరించుకునే రోజు. బంగ్లాదేశ్ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాడిన భారత సైనిక వీరులను స్ఫురణకు తెచ్చుకునే రోజు. అంతేకాదు బంగ్లాదేశ్ మీద జరిగిన క్రూరమైన దాడిని, ఫలితంగా లక్షలాది ప్రజల ప్రాణాలు బలి కావడాన్ని మనకు గుర్తుకు తెచ్చేటటువంటి రోజు కూడా. అదే సమయంలో ఈ విషాదం వెనుక ఉన్న అనాగరిక మనస్తత్వాన్ని ఖండించవలసిన రోజు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మానవత్వాన్ని మంటగలిపిన అరాచకాలు అనేకం. ఆనాటి ఆ దారుణాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ బంగ్లాదేశీయుల్లో నిలిచే ఉన్నాయి. బంగ్లాదేశ్‌కు జరిగిన అన్యాయానికి, జన హననానికి వ్యతిరేకంగా మాత్రమే కాక భారతీయ సంస్కృతిలో అంతర్నిహితమైన మానవ విలువల రక్షణ కోసం కూడా అసమాన సాహసులైన భారతదేశ సైనికులు ఆనాడు పోరాడారు.
అప్పట్లో తూర్పు పాకిస్థాన్ పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాకిస్థాన్‌లో వివాదం చెలరేగింది. తూర్పు పాకిస్థాన్‌లోని హిందువులపైనా, మైనార్టీలపైన పాక్ సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ అధికారిక లెక్కల ప్రకారం పాక్ సైన్యం అరాచకాలతో 30 లక్షల మంది చనిపోయారు. కనీసం కోటి మంది ప్రజలు బాధితులుగా మారి తూర్పు పాకిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చారు. ఆ సమయంలో నాటి భారత ప్రధాని ఇందిర తూర్పు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని పాకిస్థాన్ డిసెంబర్ 3న భారత్‌లోని 11 ఎయిర్ బేస్‌లపై వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో డిసెంబర్ 4న పాకిస్థాన్ పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ మానెక్‌షా భారత సైన్యానికి నేతృత్వం వహించారు. కరాచీపై దాడి చేయాలని నిర్ణయించారు. ఐఎన్ఎస్ నిపట్, నిర్ఘాత్, వీర్‌లు సిద్ధం అయ్యాయి. వీటికి అండగా కార్వెట్లు కిల్తన్, కట్చాల్, ట్యాంకర్ నౌక పుష్పక్‌లు రంగంలోకి దిగాయి. దీనికి ఆపరేషన్ ట్రైడెంట్ అని కోడ్‌నేమ్ పెట్టారు.
భారత్ నౌకలు కరాచీకి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా…పీఎన్ఎస్ ఖైబర్ వాటిని గుర్తించింది. వెంటనే భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ నిర్ఘాత్ స్టైక్స్ క్షిపణులను ఖైబర్‌పై ప్రయోగించింది. ఫలితంగా ఖైబర్ 222 మంది నావికులతో సహా మునిగిపోయింది. అలాగే పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం మందుగుండు, ఆయుధాలను తీసుకెళ్తున్న మర్చెంట్ నౌక ‘వీనస్ ఛాలెంజర్’ను గుర్తించడమే కాక ఐఎన్ఎస్ నిపట్ దాన్ని నీట ముంచింది. ఇక మూడో లక్ష్యంగా పీఎన్‌ఎస్ షాజహాన్‌ను భారత నౌకలు గుల్ల చేశాయి. సమీపంలోని పాక్ మైన్ స్వీపర్ నౌక పీఎన్ఎస్ ముహ్‌ఫిజ్ పై భారత్ నౌక వీర్ ఒక స్టైక్స్ క్షిపణిని ప్రయోగించింది. అది నిమిషాల్లో మునిగిపోయింది. మరోవైపు ఐఎన్ఎస్ నిపట్ పాక్‌కు చెందిన కెమారీ వ్యూహాత్మక చమురు నిల్వలపై దాడి చేసింది. అలా భారత్ చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్‌తో పాక్ వణికిపోయింది. ఆ కంగారులో ఏమి చేస్తున్నారో వారికే తెలియక వారి స్వంత ఫ్లాగ్‌షిప్ పీఎన్‌ఎస్ జుల్ఫికర్‌పై ఎఫ్-86 జెట్లతో కాల్పులు జరిపారు. ఈ వ్యవహారం మొత్తాన్ని భారత నావికాదళం రేడియో సిగ్నల్స్ సాయంతో మౌనంగా తెలుసుకొని నవ్వుకుంది. మరోవైపు బసంతర్ నదీ తీరంలో ఇరు దేశాల మధ్య యుద్ధ ట్యాంకులతో జరిగిన హోరాహోరీ యుద్ధంలో కూడా భారత్ పై చేయి సాధించింది. మొత్తంగా 13 రోజుల భీకర పోరు తర్వాత భారతదేశం 1971 డిసెంబర్ 16న పాకిస్థాన్ పై యుద్ధంలో విజయం సాధించింది. ఈ రోజున అప్పటి పాకిస్థాన్ సైన్యంలోని మేజర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, భారత్ సైన్యం మరియు బంగ్లాదేశ్‌కు చెందిన ముక్తి బాహిని సంయుక్త దళాలకు లొంగిపోయారు. 93 వేలమంది పాకిస్థాన్ సైనికులతో నియాజీ లొంగిపోతూ సరెండర్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ పై సంతకం చేశారు.
ఈ యుద్ధంలో పాకిస్థాన్ సైనికులతో పాటు ఇతరులు గరిష్టంగా 8 వేల మంది మరణించారు. 25 వేల మందికి పైగా గాయపడ్డారు. భారతదేశం 3 వేల మంది సైనికులను కోల్పోయింది. 12 వేల మంది గాయపడ్డారు. 1971 భారత్-పాక్ యుద్ధం బంగ్లాదేశ్‌ను ప్రపంచపటంలోకి తీసుకువచ్చింది. పాకిస్థాన్ నుంచి అధికారికంగా స్వాతంత్ర్యం పొందినందుకు గుర్తుగా బంగ్లాదేశ్ ఈ రోజును ‘బిజోయ్ డిబోస్’గా జరుపుకుంటుంది. 1971 డిసెంబర్ 16న యుద్ధం ముగియడంతో ఆ రోజును ప్రతీయేటా విజయ దివస్‌గా భారతదేశం నిర్వహిస్తుంది.





