
శ్రీరామ భక్తులకు గొప్ప కానుక అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయం. శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే అయోధ్యలో ఎయిర్ మొబిలిటీ సేవలు ప్రారంభమవుతాయి.ఈ విమానాశ్రయం మొత్తం శ్రీరామ ఆలయ రూపురేఖల ఆధారంగా నిర్మిస్తున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయానికి సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి.
శ్రీరామ మందిరం నిర్మాణంతో పోలికతో, గోడలపై శ్రీరాముని చిత్రాలు, చెక్కిన స్తంభాలతో ఈ విమానాశ్రయం అయోధ్య యొక్క గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తూ అందర్ని ఆకట్టుకుంటోంది. దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్నఈ విమానాశ్రయం డిజైన్, ఆలయ నిర్మాణ శైలి అయిన నాగర్ శైలి స్ఫూర్తితో రూపొందించబడుతోంది. విమానాశ్రయం గోడలపై శ్రీరాముడి జీవితంలోని 14 ముఖ్యమైన ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద ఒక గొప్ప మెట్ల గోపురం ఉంటుంది.అయోధ్య ఎయిర్ పోర్ట్‌ను మర్యాద పురుషోత్తమ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరిస్తారు.ఈ విమానాశ్రయం అయోధ్యలో పర్యాటకాన్ని పెంచనుంది. అలాగే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి శ్రీరామ భక్తులు రామనగరం అయోధ్యకు చేరుకోగలరు.
అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించారు. తొలి దశలో 220 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడెల్పుతో రన్ వేను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో దీన్ని 3750 మీటర్లకు విస్తరించే అవకాశం ఉన్నది.





