News

ఈ వివాదాలు ఏంటయ్యా వినాయక ?

355views

కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో గత ఆరు నెలలుగా ఏదో ఒక సంఘటనతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. నిత్యం వేలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం తరలి వస్తుంటారు. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. దీనిని అరికట్టేందుకు పాలకమండలి ఒక అడుగు ముందుకు వేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై ఉంది.

ఇవీ ఘటనలు

  • స్వామివారి దర్శనార్థం వచ్చిన పుంగనూరుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు అత్యుత్సాహంతో అంతరాలయంలో ఉన్న నాయకుడి ఫొటోలతో పాటు స్వామివారి మూలవిరాట్టు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
  • నిత్యాన్నదాన సత్రంలో పని చేస్తున్న కొందరు సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. దొంగలించిన రూ.లక్షల నిత్యావసర సరుకులను ఆలయ ఈవో ఎ.వెంకటేశు స్వయంగా పట్టుకున్నారు. ఇది పూర్తిగా నిఘా వైఫల్యం.
  • అనుబంధ ఆలయమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజస్వామి ఆలయ దీపస్తంభం వద్ద అన్యమత దేవుళ్ల ఫొటోలను ఎవరో చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు తొలగించారు.
  • సాక్షాత్తు ఆలయ ఈవో ఎ.వెంకటేశు.. ఆలయ సిబ్బంది, నెయ్యి దీపాలు విక్రయించే ప్రైవేటు వ్యక్తిపై చేయి చేసుకున్నాడని సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
  • ఇలాంటి ఘటనలతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇలా జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.