News

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో చాపకూడు

362views

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం చాపకూటి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దంలోనే కులమత భేదాలు రూపుమాపేందుకు పల్నాట బ్రహ్మనాయుడు చాపకూటి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తూ వీరారాధనల్లో మందపోరు రోజున వీర్లదేవాలయ ప్రాంగణంలో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నం రాశికి పూజలు చేసి పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవతో కలిసి భక్తులకు వడ్డించారు.

ఉదయం వీర్లదేవాలయంలోని కొణతాలకు పవిత్ర గంగదారి మడుగులో స్నానాలు చేయించి వీరగంధం పూసి ఆచారవంతులు ప్రత్యేకంగా అలంకరించారు. చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శంఖుతీర్థాలతో బ్రహ్మనాయుడి విగ్రహం వద్ద సేవ చేసి గ్రామోత్సవంగా పీఠాధిపతి ఇల్లు చేరారు. ఆపై కొణతాలను ఆలయంలో ఉంచారు. సాయంత్రం కథాగానం మండపంలో బ్రహ్మన్నగా పీఠాధిపతి ఉండగా వీరవిద్యావంతులు అలనాటి మందపోరు ఘట్టాన్ని గానం చేశారు. కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయిన మలిదేవ, బ్రహ్మన్న అరణ్యవాసంలో పడిన కష్టాలు, నాగమ్మ కుటిల పన్నాగంతో ఆవుల మందలను అడవిచంచులు వధించే క్రమంలో లంకన్న అసువులు బాసిన ఘటనలను వివరించగా ఆచారవంతులు వీరావేశంతో కత్తిసేవ చేశారు.

కన్నమదాసు విగ్రహావిష్కరణ: పల్నాటి వీరుడు మాల కన్నమదాసు విగ్రహాన్ని కన్నమదాసు మండపం వద్ద ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కన్నమదాసు వీరత్వాన్ని, స్వామి భక్తిని ఆయన కొనియాడారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.