News

విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది: ప్రధాని మోదీ

356views

విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించిందని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో భారత్.. మన మిత్ర దేశమని యావత్ ప్రపంచం కొనియాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారతదేశం.. విశ్వ మిత్ర దేశంగా ఎదగడం గర్వకారణం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ప్రఖ్యాత కన్హా శాంతి వనాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ప్రధాని మోదీకి ప్రపంచ ధ్యాన గురువు కమలేశ్ డి పటేల్ – దాజీ, హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.

శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు.. బాబూజీ మహారాజ్ 125వ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మోదీ.. శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్) బాబూజీ మహారాజ్ స్మారక ఫలకం ఆవిష్కరించారు. హార్ట్‌పుల్‌నెస్‌ ట్రస్ట్ కేంద్రం సేవలు అత్యంత స్ఫూర్తిదాయమని.. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్‌ సేవలకు గుర్తింపుగా పద్మ పురస్కారం ఇచ్చి కేంద్రం గౌరవించిందని ప్రధాని మోదీ అన్నారు.

కన్హా శాంతి వనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతుండటం సంతోషంగా ఉందని, ఏకకాలంలో లక్ష మంది కూర్చుకుని ప్రశాంతంగా ధ్యానం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. కన్హాశాంతి వనం.. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు విస్తృతం చేస్తోందని ప్రస్తావించిన ప్రధాని.. ప్రపంచంలో అనేక దేశాలు సహజ మార్గంలో యోగా, ధ్యానం అనుసరిస్తున్నాయని స్పష్టం చేశారు. వైజ్ఞానిక శాస్త్రం, ఆధ్యాత్మికం మేళవింపు ఓ అద్భుతం అని కొనియాడారు.

నారీశక్తి, యువశక్తి, శ్రమశక్తి, ఉద్యమశక్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. పేదలు, శ్రామికులు, రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల్లో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత్ కాల్ వేళ.. సంవృద్ధ భారత్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు.