
నేపాల్‌లో రాచరికం, హిందూ దేశం కోసం డిమాండ్ మళ్లీ తీవ్రమైంది. ఇందుకోసం రాజధాని ఖాట్మండులో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో పోలీసులకు, ఆందోళనకారులకు స్వల్ప గాయాలయ్యాయి. 2008లో రద్దు చేయబడిన రాచరికం తిరిగి రావాలని, హిందూ దేశంగా నేపాల్ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. వీరిలో ఎక్కువ మంది నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర మద్దతుదారులని చెబుతున్నారు. ప్రదర్శనలో జ్ఞానేంద్రకు అనుకూలంగా వారు నిరంతరం నినాదాలు చేశారు.
‘మాకు రాజరికం కావాలి, గణతంత్రం కాదు’
‘మాకు ప్రాణం కంటే రాజు ముఖ్యమని, మాకు రాచరికం కావాలి, గణతంత్రం కాదు’ అని నిరసనకారులు అన్నారు. నేపాల్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు మొత్తం పరిపాలనా సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. అందుకే ఈ విఫలమైన పాలనా వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని నిరసనకారులు అభిప్రాయపడ్డారు.





