
రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్.. సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్రంలోకి దిగింది.
ప్రయోగం సాగిందిలా..
రాకెట్ నింగిలోకి బయల్దేరాక, అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకరించారు. ఇందుకోసం ‘అబార్ట్’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి.
17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.





