News

16వ శతాబ్దంనాటి దశముఖి దుర్గ ఆదరణ కొరవడి ఆరుబయట ఇలా

390views

మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో.. దశావతారంలో ఉన్న దుర్గామాత ఏకశిలా విగ్రహం మట్టిలో కూరుకుపోయి ఆదరణ లేకుండా పడుంది. 18 అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ విగ్రహం స్థానిక భివాపుర్‌ వార్డులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక ఖాళీస్థలంలో ఉంది. దుర్గాదేవితోపాటు మరికొన్ని విగ్రహాలు ఇక్కడ చెల్లాచెదురుగా పడున్నాయి. స్థానికులు దీన్ని రావణ ప్రాంతంగా పిలుస్తారు. రాతి విగ్రహానికి పది తలలు ఉండటం చూసి మొదట్లో రావణుడిగా భావించారు. దీంతో దసరా రోజున అందరూ ఇక్కడ గుమికూడి రాళ్లు విసిరేవారు. కాలక్రమేణా దుర్గామాత విగ్రహమని తెలుసుకొని రాళ్లతో కొట్టడం ఆపేశారు.

16వ శతాబ్దంలో రాయప్ప అనే ధనికుడు బోలాశంకరుడికి ఆలయ నిర్మాణం సంకల్పించి ఈ విగ్రహాలు చేయించారు. విగ్రహాల పని పూర్తయ్యాక రాయప్ప హఠాన్మరణంతో ఆలయ నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోక విగ్రహాలు అలాగే ఉండిపోయాయి. ఈ విగ్రహాల చుట్టూ పురావస్తుశాఖ రక్షణగోడ ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పునరుద్ధరణకు ఎవరూ చొరవ చూపడం లేదని చరిత్ర పరిశోధకుడు అశోక్‌సింగ్‌ ఠాకుర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.