
2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 141వ సదస్సును జియో ప్రపంచ కన్వెన్షన్ కేంద్రంలో మోదీ ప్రారంభించారు. ‘‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తాం. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గం. ఇది 140 కోట్ల భారతీయుల కల. అలాగే 2029 యూత్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
ఒలింపిక్ క్రీడలతో పాటు చాలా విభాగాల్లో వృద్ధి చెందుతున్న భారత్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా, దిగ్గజ క్రికెటర్ జులన్ గోస్వామి, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పాల్గొన్నారు.




