News

భారత్‌ వెలుపల అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

472views

భారతదేశం వెలుపల అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ (Statue of Equality)’ పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన 19 అడుగుల ఈ విగ్రహాన్ని అంబేడ్కర్‌ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్‌ 14న మేరీలాండ్‌లోని ఎకోకీక్‌ నగరంలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని ‘అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (AIC)’ పేర్కొంది. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్‌ సుతర్‌ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

భారత్‌ సహా ఇతర దేశాల సంతతికి చెందిన దాదాపు 500 మంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు ఏఐసీ తెలిపింది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్‌ సెంటర్‌, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిచింది. ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి ‘దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (DICCI)’ అధ్యక్షుడు నర్రా రవి కుమార్‌ హాజరయ్యారు. ప్రతిపౌరుడు సాధికారత సాధిస్తేనే దేశం ఆర్థికంగా సుసంపన్నం అవుతుందని అంబేడ్కర్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆయన ప్రతిపాదించిన ఆ ఆర్థిక విధానమే ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని తెలిపారు.