News

దసరా మహోత్సవాలకు సిద్దమైన ఇంద్రకీలాద్రి

230views

ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారిని పది విశేష అలంకారాల్లో దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగనుంది. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకారాలు జరిగే ఆలయం విజయవాడ దుర్గగుడి మాత్రమే కావడం విశేషం. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిని అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశ్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, కమిషనర్‌ సత్యనారాయణ, కలెక్టర్‌ ఢిల్లీరావు, పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా, దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్‌ రామారావు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా గంట నుంచి గంటన్నర లోపే అమ్మవారి దర్శనం కలిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఒకసారి క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఉచిత అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఆదివారం ఉదయం 9 గంటల తర్వాతే దర్శనం

ఆదివారం నుంచి ప్రారంభమమ్యే దసరా ఉత్సవాల్లో తొలి రోజున తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ప్రతి రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 20వ తేదీ మూలా నక్షత్రం రోజున మాత్రం తెల్లవారుజామున రెండు గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది.

దసరా ప్రత్యేక ఆర్జిత సేవలివే…

దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అమ్మవారి ఖడ్గమాలార్చన ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద ఖడ్గమాలార్చన చేస్తారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఖడ్గమాలార్చనను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కుంకుమార్చన రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఒక బ్యాచ్‌ మాత్రమే జరుగుతుంది. ఇక ఉత్సవాల్లో మిగిలిన 8 రోజులు రెండు బ్యాచ్‌లను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు, 10 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహిస్తారు. ప్రత్యేక శ్రీచక్రనవార్చన మల్లికార్జున మహా మండపం రాజగోపుర ప్రాకారంలో చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ సేవ ఉంటుంది. ప్రత్యేక చండీ హోమం 15వ తేదీ ఉదయం 10 గంటలకు, 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమతుంది.