News

అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 10 కుటుంబాలు

221views

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం నాడు 10 ముస్లిం కుటుంబాలకు చెందిన 70 మంది సభ్యులను హిందూ మతంలోకి మార్చారు ఆచార్య మృగేంద్ర సింగ్.’ఘర్ వాప్సీ’ కార్యక్రమం కింద గత 1.5 సంవత్సరాలలో సుమారు 1100 మంది ముస్లింలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ పూర్వీకుల మతమైన హిందూమతంలోకి తిరిగి రావాలని ఈ సందర్బంగా కోరారు.

భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ మొదట సనాతన ధర్మానికి చెందినవారే అని, భయం లేదా బలవంతం కారణంగా ఇస్లాంలోకి మారారని అన్నారు. ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. పూర్వీకులు చేసిన తప్పును సరిదిద్దుకుంటూ పలువురు తిరిగి హిందూ మతంలోకి వస్తున్నారని ఆచార్య మృగేంద్ర సింగ్ చెప్పారు.

సెప్టెంబర్ 23న ముజఫర్‌నగర్ బాఘ్రా బ్లాక్‌లోని యోగా సాధనా యశ్వీర్ ఆశ్రమంలో పది ముస్లిం కుటుంబాలు హిందూ మతంలోకి మార్చబడ్డాయి. ఆర్ధిక సహాయం చేస్తామంటూ వీరిని 10 ఏళ్ల క్రితం ఓ మౌల్వీ, కొంతమంది ముస్లిం నాయకులు కలిసి ఇస్లాం మతంలోకి మార్చారు. అయితే ఈ కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పడంతో తాము శుద్ధి యాగాన్ని నిర్వహించి వారి మాతృధర్మంలోకి తీసుకువచ్చామని తెలిపారు. తమ పూర్వీకుల మతంలోకి తిరిగి వచ్చినందుకు వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని మృగేంద్ర సింగ్ స్పష్టం చేసారు.