News

‘ముద్ర’తో 8 కోట్ల మంది కొత్త పారిశ్రామికవేత్తలు!

187views

కొత్త విధానాలు, వ్యూహాలతో ‘నవ భారతం’ దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరచుకుంటున్నాయని చెప్పారు. సాంకేతికత , మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. గురువారం నిర్వహించిన ‘రోజ్‌గార్‌ మేళా ‘ను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఎంపికైన 71,506 మందికి ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. దేశ యువత అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ ‘రోజ్‌గార్ మేళా’ నిదర్శనమని పేర్కొన్నారు.

సూక్ష్మ, చిన్నసంస్థల కోసం అమలు చేస్తున్న ‘ముద్ర’ రుణాల పథకం.. ఎనిమిది కోట్ల మంది కొత్త పారిశ్రామికవేత్తలను సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 70 శాతం లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. ‘క్షేత్రస్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మరుణాలది కీలక పాత్ర. అయితే, తమను తాము పెద్ద ఆర్థికవేత్తలుగా భావించే, బడా వ్యాపారులకు కేవలం ఫోన్‌ల ద్వారానే రుణాలు ఇచ్చిన కొందరు.. ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించలేదు. వారే ఈ పథకాన్ని ఎగతాళి చేస్తున్నారు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ నేత చిదంబరాన్ని ఉద్దేశించి చురకలంటించారు. రూ.50 వేల ‘ముద్ర’ రుణంతో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చంటూ చిదంబరం ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాంద్యం, మహమ్మారి, ప్రపంచ సవాళ్ల మధ్య ఇతర దేశాలు భారత్‌వైపు ఆశాజనకంగా చూస్తున్నాయని తెలిపారు. అంకురాలు(స్టార్టప్‌లు) దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్న ఓ నివేదికను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాలు, రైల్వే, రక్షణ ఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్ల తయారీ తదితర రంగాల్లో భారత్‌ సాధిస్తోన్న ప్రగతిని వివరించారు.