News

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల

192views

దేశవ్యాప్తంగా వినియోగదారులకు శనివారం నుంచి గొప్ప ఉపశమనం కలగబోతోంది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సవరించడంతో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల ఇళ్లలోని వంట గదులకు సరఫరా చేసే పైప్‌డ్ నేచురల్ గ్యాస్, ఆటోమొబైల్స్‌కు సరఫరా చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు శనివారం నుంచి 11 శాతం వరకు తగ్గుతాయి.

అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ… బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యంగా పీఎన్‌జీ, సీఎన్‌జీలను ఉపయోగించేవారికి దీనివల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ప్రజలకు మోదీ ఈ బహుమతిని ప్రకటించారని చెప్పారు. ఇది శుభదినం, మంచి నిర్ణయం అన్నారు. దీనివల్ల గృహ వినియోగదారులకు, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి, రైతులకు మేలు జరుగుతుందన్నారు.

ధరలు తగ్గే విధానాన్ని వివరిస్తూ, పుణేలో కేజీ సీఎన్‌జీ రూ.92 ఉంటే, నూతన విధానం ప్రకారం అది రూ.87 అవుతుందన్నారు. పీఎన్‌జీ ధర రూ.57 ఉంటే, అది రూ.52కు తగ్గుతుందన్నారు.