News

అన్నవరంలో ఆచార్యుల శిక్షణ

1.3kviews

బండెడు పుస్తకాల మోత, గాలి పారని ఇరుకిరుకు తరగతి గదులు, అంతులేని సిలబస్ తో అలసి సొలసి చేసే పోరాటం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు అందరి ప్రత్యక్ష పరోక్ష వత్తిడి పిల్లలకు ఊపిరి సలపనివ్వటం లేదు. ఆటలేదు, పాటలేదు, వ్యాయామం లేదు పిల్లల బాల్యం భారమై పోతోంది. బాలలకు వీటి నుంచి విముక్తి కలిగించడం కోసం సమరసతా సేవా ఫౌండేషన్ నడుం బిగించింది. వారంలో అరు రోజుల పాటు ప్రతి రోజు  రెండు గంటల చదువు తోపాటు ఆట,పాట,కళలు, కధల ద్వారా పిల్లలలో సంస్కారాన్ని నింపే కలల బడిగా బాల వికాస కేంద్రం (సాయంత్రం బడి) రూపొందుతున్నది.

ముఖ్యంగా హరిజన గిరిజన పల్లెల్లో విద్యార్థులకు సమరసత, సంస్కారాలను అందించడం కోసం బాలవికాస కేంద్రాలు నడిపేందుకు సమరసతా సేవా ఫౌండేషన్ నిర్ణయించింది. ఇందు కోసం ఎంపిక చేసిన ఆచార్యులకు రెండు రోజుల శిక్షణ అన్నవరం దేవస్థానంలో జరిగింది. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. పిల్లలలో శారీరిక మానసిక వికాసాన్ని కలిగించే ఆటలు, పాటలు, కధలు ఎంపిక చేసుకోవటం, నేర్పటం, ఆటలాడించడం వంటి వివిధ అంశాలలో ఆచార్యులకు శిక్షణ ఇచ్చారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఈ బాల వికాస కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IAS, SSF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్, సభ్యులు శ్రీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొని మార్గదర్శనం చేశారు.