
విష్ణువు ద్వయావతారుడుగా వెలసిన దివ్యక్షేత్రం విశాఖ జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దివ్యధామం. ఈ క్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అనేకమంది సామ్రాట్‌లు, రాజులు చెక్కించిన శాసనాలు ఆలయ గోడలపై మనకు కనిపిస్తుంటాయి. అటువంటి శాసనాలలో కుళుత్తుంగ చోళుడు రాయించిన 1087 నాటి శాసనం పురాతనమైనదిగా ఇప్పటి వరకు చరిత్ర రికార్డులలో ఉన్నది. తాజాగా శకసంవత్సరం 1089లో స్వచ్ఛమైన తెలుగు అక్షరాలు, అంకెలతో ఉత్తరాయణ సంక్రాంతినాడు నారగద్యణాలు 100 ‘తిరుపన దాసరి కుంఠ’ అనే దాత అప్పన్నస్వామి భాండాగారానికి ఒసగినట్టు, వాటిని అఖండ దీపారాధన నిమిత్తం ఇచ్చినట్టు శాసనం ఉంది. ఈ శాసనాన్ని కంచి కామకోటి పీఠానికి చెందిన మహిళా స్థపతి ఒకరు ఇటీవలె తమ పరిశీలనలో కనుగొన్నారు. నారగద్యణాలుగా పేర్కొనబడిన వాటిని తరువాతి కాలంలో నారసింహ మాణికలుగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. తాజాగా కనుగొన్న పురాతన శాసనాన్ని మైసూరుకు చెందిన ఎపిగ్రఫీ డిపార్టుమెంటు, అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన నిఫుణుడు డైరెక్టర్ డా.మునిస్వామి పరిశీలించి, పరీక్షించారు. ఇది ఆలయంలో లభించిన అత్యంత రెండో పురాతన శాసనంగా ధ్రువీకరించారు.





