News

సంఘ్ భారత దేశ ఆత్మ : మన్మోహన్ వైద్య

2views

లక్నో : ఆర్ఎస్ఎస్ అనేది యావత్ సమాజానికి సంబంధించిన సంస్థ అని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. ఏకత్వ భావనతో సమాజాన్ని ఏకం చేయడమే సంఘ కార్యంలోని సారాంశం అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది సందర్భంగా వారణాసి మహా నగర్ లో ‘ప్రముఖ జన సంవాద సంగోష్ఠి’ జరిగింది.

ఈ సందర్భంగా మన్మోహన్ వైద్య మాట్లాడుతూ సంఘ్ అనేది భారత దేశ ఆత్మ అని అభివర్ణించారు. భారతదేశపు అస్తిత్వం ఆధ్యాత్మికమైనదని, దీనినే ‘హిందుత్వ’ అని పిలుస్తారని అన్నారు. వ్యక్తి వికాసం ద్వారా సామాజిక చైతన్యం, సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని ,దీని ద్వారా దేశ నిర్మాణం దిశగా అడుగులు పడతాయని, సంఘ్ ఈ అంశంపైనే కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం తప్పనిసరి అని సూచించారు. ‘‘మాకు సమయమే లేదు. అని అనలేం. చేప ఎలాగైతే నీటిలో నివసిస్తుందో, మనం కూడా సమయం అన్న పరిధిలోనే వుంటాం. అందుకే సామాజిక కార్యం కోసం అందరూ తమ కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

ఇక.. ధర్మం అనే భావనను మన్మోహన్ వైద్య వివరిస్తూ.. భారత్ లో ధర్మం అంటే పాశ్చాత్యుల అర్ధంలో వున్నట్లు మతం కాదని, సమాజానికి ఇవ్వడం దానం అని, సమాజం నుంచి మనం పొందిన దాన్ని తిరిగి ఇవ్వడమే ధర్మం అని వివరించారు. ధర్మం అనేది మనుషులను విభజించదని, దానికి బదులుగా సమాజాన్ని ఏకం చేస్తుందన్నారు.

భారతదేశంలో ‘మతం’ అనే పదం ఒక రకమైన ఆరాధనను సూచించవచ్చని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, బహుళత్వంలో ఏకత్వాన్ని చూడటమే భారతదేశపు సహజ ధర్మం. ఒక వ్యక్తి ధర్మబద్ధంగా మారినప్పుడు మరియు సమాజం ధర్మంపై ఆధారపడినప్పుడు, దేశం బలపడుతుంది.’’ అని పేర్కొన్నారు.
‘ప్రపంచ ఆర్థిక చరిత్ర’ అనే పుస్తకం ప్రకారం క్రీ.శ. 1 నుండి 1700 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 33 శాతం వాటాను కలిగి ఉందని ఆయన అన్నారు. తోలు, లోహ, సుగంధ ద్రవ్యాలు మరియు వస్త్ర పరిశ్రమలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ స్థానంలో వుండేదన్నారు. మహిళలు తమ ఇళ్లలోనే పరిశ్రమలను నిర్వహించేవారని, పురుషులు వస్తువులను అమ్మడానికి బయటకు వెళ్లేవారని ఆయన అన్నారు. ఇంటి సంపదపై నియంత్రణ ఇంటి యజమానురాలి చేతిలోనే ఉండేది, అందుకే సాంప్రదాయకంగా మహిళలను గృహలక్ష్మి అని పిలిచేవారని వివరించారు.

ప్రపంచంలో రెండు పేర్లతో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దేశం భారత్ అని తెలిపారు. అయితే స్వాతంత్రం తర్వాత మయన్మార్ ను బర్మాగా మార్చుకున్నారన్నారు. మన అస్తిత్వం ఏమిటో మనం నిర్ణయించుకోకపోతే, మన ప్రాధాన్యతలను కూడా నిర్ధారించుకోలేమని ఆయన పేర్కొన్నారు. ప్రగతిశీల మేధోవాదం పేరుతో మన సొంత అస్తిత్వాన్ని తిరస్కరించే ధోరణి భారత్‌లో చాలా కాలంగా ఆమోదం పొంది ఉండేది; అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.