News

అరుణాచల్‌లో అరుదైన హిమ మీనం

11views

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లాలో గల ఓ ఎత్తైన సరస్సులో అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ దేశంలోని మంచినీటి చేపల వైవిధ్యంలో మరో కొత్త జాతిని జోడించింది. ఇంతకుమునుపు టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తైన సరస్సుల్లో గుర్తించిన అరుదైన ‘స్కిజోపిగాప్సిస్‌ వడెల్లి’ అనే అరుదైన చేపల జాతికి ఇది విస్తరణగా చెప్పవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లోని భీమతాల్‌లో గల ఐకార్‌ – సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోల్డ్‌వాటర్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ (ఐకార్‌ – సీఐసీఎఫ్‌ఆర్‌) నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ మత్స్యశాఖ సహకారంతో గత జులై నెలలోనే పరిశోధకులు వీటి నమూనాలు సేకరించారు. సిప్రినిడి కుటుంబానికి చెందిన ఈ చేపలు అధిక ఎత్తులో ఉండే మంచినీటి సరస్సుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలవాటుపడి ఉంటాయి. పొడవాటి స్తూపాకార శరీరాన్ని కలిగి ఉండే ఈ చేప పైభాగాన ముదురు బూడిదరంగు లేదా ఆలివ్‌ రంగుతో.. కింది భాగాన లేత వెండిరంగు లేదా మీగడలాంటి తెల్లరంగుతో ఉంటుంది.