
భోపాల్ – ఉజ్జయినీ ప్యాసింజర్ రైలు పేలుడు కేసులో ఏడుగురికి మరణశిక్ష విధించగా, మరో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో నిందితులను హాజరు పరచగా.. ఈ దారుణానికి పాల్పడిన మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదుల్లో ఏడుగురికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధించింది. శిక్షకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించిన తర్వాత, భోపాల్ – ఉజ్జయినీ ప్యాసింజర్ ట్రెయిన్ పేల్చివేత కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. వాస్తవానికి సోమవారం శిక్ష విధించాల్సి ఉండగా, తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. నేడు ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష, జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ప్యాసింజర్ రైలు పేలుడు దుర్ఘటన కేసులో శుక్రవారం నాడు ఉగ్రవాదులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో మార్చి 7, 2017 ఉదయం జరిగిన రైలు పేల్చివేత ఘటనలో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఖొరాసన్ విభాగానికి చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉందని తేలింది. పేలుడు జరిగిన మరుసటి రోజు మార్చి 8, 2017న, లక్నోలోని కకోరి ప్రాంతంలో, ఖొరాసన్ గ్రూపులతో సంబంధం ఉన్న కాన్పూర్ కు చెందిన సైఫుల్లాను ATS ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. మహమ్మద్ ఫైజల్, గౌస్ మహ్మద్ ఖాన్, మహ్మద్ అజర్, అతిఫ్ ముజఫర్, మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్, ఆసిఫ్ ఇక్బాల్ అలియాస్ రాకీ, మహ్మద్ అతీఫ్ అలియాస్ అతిఫ్ ఇరానీలను పోలీసులు అరెస్టు చేశారు.





