
శ్రీశైలంలో మహాక్షేత్రంలో ఈ నెల 11న ప్రారంభమైన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. పంచాహ్నిక దీక్షతో 11 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపైౖ ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారుల డప్పు వాయిద్యాలు, శంఖు, ఢమరుక నాదాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పుష్పోత్సవం, శయనోత్సవం
ఆలయ పాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవాన్ని నిర్వహించారు. పుష్పోత్సవంలో 21 రకాల పుష్పాలతో విశేషంగా స్వామి, అమ్మవార్లను అర్చించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం భరతనాట్యం, సంప్రదాయ నృత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నాట్య కళాకారుల అద్భుత ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది.
మహానందిలో మహా పూర్ణాహుతితో ముగింపు
ఉత్సవమూర్తులకు త్రిశూల స్నానం, ధ్వజావరోహణం
మహానంది, ఫిబ్రవరి 21: మహానంది క్షేత్రంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఈసందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడు, కల్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహారించిన బ్రహ్మానందీశ్వరుడు, గంగాదేవి ఉత్సవమూర్తుల విగ్రహాలను మేళతాళాలతో రుద్రగుండం కోనేరు వద్దకు తీసుకొచ్చారు. పంచ పాండవుల మంటపం వద్ద ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి త్రిశూల స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కోనేరు గట్టుపై ఉన్న ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహించి శాస్రోక్తంగా ధ్వజావరోహణం, నాగబలి పూజలు నిర్వహించారు. యాగశాల మంటపంలో వివిధ ద్రవ్యాలతో పూర్ణాహుతి కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన కొమ్మా మహేశ్వరరెడ్డి, సభ్యులు, ఈవో కాపుచంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
కన్నుల పండువగా తెప్పోత్సవం
మహానందిలో మంగళవారం రాత్రి వైభవంగా తెప్పోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిపై అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో రుద్రగుండం కోనేరు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన తెప్పోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ఆశీనులు గావించారు. రుత్వికులు పూజల చేశారు.





