News

పోలమాంబ ఐదోవారం జాతరకు పోటెత్తిన భక్తులు

207views

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చ కల్పవల్లి శంబర పోలమాంబ ఐదోవారం జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే చదురు, వనంగుడులు కిటకిటలాడాయి. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. కొందరు గోముఖీ నదీతీరం వద్ద కోళ్లు, చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. వనంగుడి వద్ద వేపచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా క్యూలైన్లు వద్ద తాగునీరు అందించేవారు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులను కూడా పూర్తిస్థాయిలో నడపకపోవడంతో అత్యధికులు ప్రైవేట్‌ వాహనాలనే ఆశ్రయించాల్సి వచ్చింది. మక్కువ నుంచి శంబర, చెముడువైపు వచ్చే వాహనాలను రెండు కిలోమీటర్ల ముందే నిలుపుదల చేశారు. దీంతో ఎండలో కాలినడకన భక్తులు ఈసురోమంటూ శంబర గ్రామానికి చేరుకున్నారు. పోలమాంబను బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన తదితరులు దర్శించుకున్నారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని పూజలు చేశారు. దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎంవీ సురేష్‌బాబు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన పనులు గుర్తించి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.