
శ్రీశైలంలో నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా అర్చకులు, వేదపండితులు యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాసో్త్రక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వసా్త్రలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత వసంతోత్సవం జరిపించి సమంత్రకంగా భక్తులపై సంప్రోక్షించారు.
ధ్వజావరోహణ…
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల మెదటిరోజున బ్రహ్మోత్సవ పారంభ సూచికంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరించిన ధ్వజపటాన్ని అవరోహణ చేశారు.
సదస్యం.. నాగవల్లి..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమాన్ని జరిపించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో స్వామి, అమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమంలో భాగంగా మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను కల్యాణమాడిన భ్రమరాంబ అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు.
నేటితో ముగియనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం జరిపించనున్నారు. అనంతరం పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు.





