News

శివయ్యా.. భక్తులకు భద్రత లేదయ్యా!

211views

ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవక్షేత్రమైన పుణ్యగిరిలో ఏటా మహాశివరాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు లక్షకు పైబడి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొండపైనున్న ఉమాకోటి లింగేశ్వరుని దర్శించుకొనేందుకు మెట్ల మార్గమొక్కటే ఉంది. కొండకొచ్చే భక్తులంతా ముందుగా దారగంగమ్మ లోయలో స్నానాలు చేస్తారు. ఈలోయ కిందకు దిగే ముందు దారగంగమ్మ తల్లి విగ్రహం కనిపిస్తుంది. ఇనుప నిచ్చెన సాయంతో లోయలోకి దిగుతారు. కొండపై నుంచి పడే జలపాతంలో తడుస్తూ బయటకు వస్తారు. లోయలోకి దిగేందుకు ఐదేళ్ల క్రితం సుమారు రూ.40 వేలతో నిర్మించిన ఇనుప వంతెన పాడైంది. ఊచలు బయటకు వచ్చేశాయి. వంతెనను మూసేస్తామని మూడు రోజుల క్రితం పుణ్యగిరి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవో సూర్యకళ చెప్పారు. లోయలో స్నానాలకు వచ్చేవారిని కింద నుంచి పంపిస్తామన్నారు. మహా శివరాత్రికి వచ్చే భక్తులు వంతెనపై నుంచి లోయలోకి దిగి కిందకు వచ్చే సమయంలో తోపులాట చోటుచేసుకుంటోంది. రద్దీ వల్ల చోరీలు జరుగుతుంటాయి. ఈ వంతెన నిర్మించకముందు ఏటా వెదురుకర్రలతో వంతెన ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది తాత్కాలికంగానైనా వంతెన ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

– రెండో స్నానఘట్టమైన పుట్టదార వద్ద ఏటా భక్తులను తల కూడా తడవకుండానే పోలీస్‌లు పక్కకు నెట్టేయడం పరిపాటి. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పారే జలం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఉమాకోటి లింగేశ్వర స్వామి మూలవిరాట్‌ను తాకుతూ పారే గంగకావడంతో ఇక్కడ స్నానం చేసేందుకు భక్తులు పోటీపడతారు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా అంతా ఒకేచోట స్నానాలు చేయాల్సిరావడంతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడం లేదు.

– స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మెట్ల దారిలోనే పైకి వెళ్లాలి. శివరాత్రి మరుసటి రోజున రెండు వైపులా మెట్లమార్గం బారులుతీరడం.. తోపులాటతో స్వల్పంగా గాయాలు కావడం సాధారణంగా మారింది. ఈ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు.