
శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ, ఆహోబిల రామానుజస్వామి ఆధ్వర్యంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని గోపాలసాగరం భక్తులతో కళకళలాడింది. గోవిందనామస్మరణతో మార్మోగింది. యాగశాలలో విశేష హోమం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దేవానాథ రామానుజజీయర్ స్వామి అనుగ్రహా భూషణం చేపట్టి ప్రవచనాలు చెప్పారు. మనం వేడుకున్న పేర్లు వేరైనా.. భగవంతుడు ఒక్కడేనని, భక్తి భావంతో ప్రపంచ శాంతికి మార్గం వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వేళ స్వామి అశ్వవాహన సేవలో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తుల నడుమ దోపిడీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అలాగే చండిపుట్టుగకు చెందిన పండితిరుపతిరావు సంగీత విభావరి, మందసకు చెందిన సాయిమోహన్ నృత్య కళావేదికప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేదపండితులు కూర్మాచార్యులు, సత్యానందపాఢి, కొర్ల కన్నారావు, శనాపతి కిషోర్, జల్లు కాళీచరణ్ పాల్గొన్నారు.





