ArticlesNews

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో హనుమాన్‌ ఆలయం.. నిత్యం జవానుల పూజలు

349views

గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ ఇండియా – పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్‌లో ఉన్న భెడియా బెట్ హనుమాన్‌ జీ టెంపుల్ ఇది.. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా.. అనేక పర్యాటకు ప్రాంతాలు ఉన్నాయి. కచ్‌లో ఉన్న ఈ హనుమాన్ జీ ఆలయం చాలా ప్రత్యేకమైనది. భారతదేశం – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో.. భారత్‌లో ఉన్న ఈ ఆలయం.. దేశాన్ని రక్షించే సైనికుల విశ్వాసానికి చిహ్నంగా ఉంది. సైనికులతో పాటు, హనుమాన్ జీ కూడా ఇక్కడ సరిహద్దును కాపాడుతుంటారనే భావనను ఈ ఆలయం కలిగిస్తుంది.

జానపద కథల ప్రకారం..
1971 యుద్ధం తర్వాత భారత సైనికులు తిరిగి వస్తుండగా.. అంతర్జాతీయ సరిహద్దుకి సమీపంలోని ఎడారిలో సైనికుల బృందం.. హనుమంతుని విగ్రహాన్ని చూసింది. ఆ సమయంలో ఆకాశవాణి… ఆ ప్రదేశంలో హనుమంతుని ఆలయాన్ని నిర్మించమని సైనికులకు సూచించిందని ప్రతీతి. మరొక జానపద కథనం ప్రకారం… సైనికులు ఈ విగ్రహాన్ని పాకిస్తాన్‌లోని.. జట్ తలై అవుట్‌పోస్టుకు సమీపంలో కనుక్కున్నారు. దీనిని భారత సరిహద్దుకు తరలించి.. సరిహద్దుకు సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. 2018 సంవత్సరంలో… భుజ్ స్వామినారాయణ్ ఆలయానికి చెందిన సాధువులు ఈ ఆలయాన్ని సందర్శించి.. దీని దయనీయమైన పరిస్థితిని గమనించి, సరిహద్దులో ఉన్న ఈ ప్రత్యేక ఆలయానికి ఏదైనా చేయాలని మహంత్ స్వామీజీ తమ కోరికను వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని భుజ్ మందిర్‌గా పునరుద్ధరించారు. ఈ చిన్న ఆలయానికి రూ. 2.5 కోట్లతో సరిహద్దులో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. నేడు అనేక మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి భుజ్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తున్నారు. జవాన్లకు ఈ ఆలయం పట్ల అచంచల విశ్వాసం ఉంది. యాత్రికులు తమ కోరికలు ఇక్కడ చెప్పుకుంటారు. అవి నెరవేరినప్పుడు ఆలయంలో ఓ గంటను సమర్పిస్తారు. అందువల్ల ఈ ఆలయంలో చాలా గంటలు కనిపిస్తాయి.

ఈ ఆలయం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో… నో మ్యాన్స్ జోన్ అని పిలిచే ప్రాంతంలో ఉన్నందున పర్యాటకులు ఇక్కడకు వచ్చేందుకు బీఎస్‌ఎఫ్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. పర్యాటకులు తమ ప్రయాణ తేదీకి 5 నుంచి 7 రోజుల ముందు కోడ్కి రోడ్… భుజ్‌లోని బీఎస్‌ఎఫ్‌ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో రాతపూర్వక దరఖాస్తును సమర్పించాలి. బీఎస్‌ఎఫ్ డీఐజీకి పంపిన లేఖలో ప్రయాణికుల సంఖ్య, పేర్లు, వాహనాల వివరాలతోపాటు తేదీ, ప్రయాణ ఉద్దేశం తెలపాలి. దీంతోపాటు ప్రతి ప్రయాణికుడు ప్రభుత్వం ఆమోదించిన గుర్తింపు కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీలను సమర్పించాలి. రెండు మూడు రోజుల్లో బీఎస్‌ఎఫ్‌ ద్వారా వెరిఫికేషన్ తర్వాత అనుమతులు ఇస్తారు.