News

శంబర పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు

324views

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని శంబర పోలమాంబ మూడోవారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లు దాటి బారులుదీరారు. సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వారు వనం, చదురుగుడుల వద్ద క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. తొలుత గోముఖీ నది తీరంలో మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం పోలమాంబ భూస్థాపితమైన చెట్టుకు పూజలు చేశారు. పసుపు కుంకుమ, చీరలు సమర్పించారు. క్యూలైన్లలో తాగునీరు, ప్రసాద విక్రయ కౌంటర్లతో పాటు వనం గుడి వద్ద కూడా కేశఖండన శాల ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులు, చిన్నారులకు దేవదాయశాఖ ఉచితంగా ప్రసాదం, పాలు అందించింది. ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాలూరు సీఐ ఎస్‌.ధనంజయరావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు భద్రత విధులు నిర్వహించారు. సాలూరు నుంచి శంబరకు ప్రత్యేక బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు నడిచాయి. తొలి, రెండో జాతరకు మించి భక్తులు మూడోసారి వచ్చినట్లు ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు.