News

వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం.. వేడుకలు ఎప్పటి నుంచి మొదలంటే?

427views

శ్రీకాకుళం – వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకూ మందస వాసుదేవ పెరుమాళ్‌ ఆలయంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామిజీల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

మొత్తం కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 10వ తేదీ తొలిరోజు ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, సుందరకాండ పారాయణం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 11న వాసుదేవ పెరుమాళ్‌ అభిషేక మహోత్సవం, టి.చక్రవర్తి (లొహరిబంద) వారిచే సంకీర్తనలు, ఆరంగి వెంకట్రావుచే శాస్త్రీయ సంగీత విభావరి, యండమూరి శిఖామణిచే శ్రీనివాసకళ్యాణం హరికథ, 12న ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, విశేష గరుడపూజ, హనుమద్వాహనసేవ, శ్రీరామ పూజ, సాయంత్రం మహేంద్ర కళామండలిచే అన్నమాచార్య సంకీర్తనలు, శివసాయి నృత్యకళానికేతన్‌ వారిచే నృత్యప్రదర్శన, 13న యాగశాలలో విశేష హోమాలు, కల్పవృక్షసేవ, సాయంత్రం పొందల శ్రీనివాస్‌చే సంగీత విభావరి, నాట్యశ్రీ నృత్యకేతన్‌ వారిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, 14న భూసమేత వాసుదేవస్వామి కళ్యాణం, కోలాటం, గ్రామవీధుల్లో తిరువీధి, సాయంత్రం హరిప్రియ(రాజమండి) వారిచే శాస్త్రీయ సంగీత విభావరి, 15న యాగశాలలో హోమాలు, పొన్నచెట్టు వాహనసేవ, అశ్వవాహన సేవ, దోపిడీ ఉత్సవం, సాయంత్రం పండి తిరుపతిరావు ఆధ్వర్యంలో సంగీత విభావరి, సాయిమెహర్‌ నృత్యకళానికేతన్‌ వారిచే నృత్య ప్రదర్శన, 16న రథోత్సవం, చక్రతీర్ధం, అవభృద స్నానం, పుష్పయాగం, సాయంత్రం పొందల శ్రీనివాస్‌చే సంగీత విభావరి, 17న వాసుదేవపెరుమాళ్‌ అభిషేకం, సప్తావరణం, ఏకాంతసేవ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఆలయానికి ఎంతో చరిత్ర..
వాసుదేవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజుల కాలంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. 14వ శతాబ్దం నాటి ఈ వాసుదేవాలయాన్ని మందస రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. 17వ శతాబ్దం వరకూ మంజూష (మందస) సంస్థానాధీశులు ఆలయ నిర్వహణ చూసేవారు. 1779-1823 మధ్య కాలంలో 45వ రాజు లక్ష్మణరాజమణిదేవ్‌ ఆలయ వైభవానికి కృషి చేసేవారు. ఏటా 9 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థానాధీశుల కాలం చెల్లే వరకూ ఏటా బ్రహ్మోత్సవాలు సాగేవి. తరువాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో పురాతన ఆలయానికి చూసి చలించిపోయారు. ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2010 ఫిబ్రవరి 5న బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.