

యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ‘యువ ధార్మిక సమ్మేళనం’ రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ విద్య రావచ్చు గానీ సంస్కారం రాదన్నారు. సంస్కారం కలిగిన వ్యక్తి దేవుడి గురించి ఆలోచిస్తాడన్నారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సంస్కారవంతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. టీటీడీ పీఆర్వో రవి మాట్లాడుతూ.. యువతకు విద్యతో పాటు వినయం, సంస్కారం అలవడినప్పుడే సమాజంలో చక్కటి పౌరులుగా ఎదుగుతారన్నారు. తల్లిదండ్రులు, గురువుల మాట వినాలని, తమ పని తాము చేసుకుంటూ ఆదర్శంగా నిలవాలన్నారు. సీఏవో శేషశైలేంద్ర మాట్లాడుతూ… మానవ జీవితంలో రామాయణం, భగవద్గీత, భాగవతాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చిన దాదాపు 1,600 మంది 10 నుంచి 15 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు పాల్గొన్నారు.





