News

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు సిద్దం!

326views

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఇల కైలాసానికి తరలిరానున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న ప్రసాదాలు తీసుకునేందుకు భక్తులు మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. మొత్తం 30 లక్షల లడ్డూలు సిద్ధం చేసేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు శివదీక్ష భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండడంతో రోజుకు లక్ష నుంచి లక్షన్నర లడ్డూల అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 2 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూ తయారీకి కావాల్సిన పొయ్యిలు, వంట సామగ్రి సిద్ధం చేస్తున్నారు. తయారైన వాటిని లడ్డూ విక్రయశాల వద్ద నిల్వచేయనున్నారు.