
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు. అయితే, మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్‌లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ కాల్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాగా, కాల్ ట్రాకింగ్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక, బాంబు బెదిరింపు నేపథ్యంలో అయోధ్యలో పోలీసు బందోబస్తు పెంచినట్టు పోలీసు ఉన్నాతాధికారులు స్పష్టం చేశారు.





