
పంజాబ్ అమృతసర్ లోని భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ బలగాలు.. అమృతసర్ సెక్టార్ రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్‌ను శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేశారు. పాకిస్థాన్ ఈ డ్రోన్ ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాలు సాగిస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. బీఎస్‌ఎఫ్ దళాలు సరిహద్దు కంచె వద్ద శుక్రవారం ఉదయం డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
డ్రోన్‌తో పాటు నిషేధిత డ్రగ్స్ ప్యాకెట్‌ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పంజాబ్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి క్రమంగా అక్రమ కార్యకలాపాలు పెరిగాయి. చలికాలం కావడం… పొగ మంచు ఉండటంతో దాన్ని ఆసరా చేసుకుని పాక్ ఉగ్రవాదులు మాదకద్రవ్యాలను భారత్ లోకి పంపుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా పంజాబ్ సెక్టార్‌లో జరిగిన మూడో సంఘటన కావడం పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది.





