News

శివయ్య.. నీకు నైవేద్యం లేదయ్యా?

311views

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని ఖండివరం గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 400 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఈ ఆలయానికి సుమారు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నప్పటికీ స్వామి వారికి కనీసం ధూపదీప నైవేద్యం కూడా దక్కని పరిస్థితి. ఈ భూములు రైతుల ఆక్రమణలో ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ధూపదీప నైవేద్యాల కోసం నాలుగు వందల ఏళ్ల క్రితం అప్పటి బ్రాహ్మణులు సర్వే నంబరు 143/1లో 4.89 ఎకరాలు, సర్వే నంబరు 132/5లో 1.68 ఎకరాలు, సర్వే నంబరు 39/1లో 1.47 ఎకరాలు ఇచ్చారని రెవెన్యూ అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది ఎకరాల నాలుగు సెంట్ల భూములు సుమారు 20 మంది రైతుల ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు. సుమారు వందేళ్లుగా ఈ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న రైతులు కనీసం దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి కూడా ఏమీ ఇవ్వడం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. ఏటా స్వామివారి కల్యాణం జరుగుతున్నప్పుడు కూడా వీరు పట్టించుకోవడం లేదన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నెలకు రూ.5 వేలు చొప్పున గత 15 సంవత్సరాలుగా అందిస్తున్న నగదుతో శివాలయానికి సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు. దీనిపై వీఆర్‌వో అప్పారావును వివరణ కోరగా ప్రస్తుతం ఈ భూములు రైతుల ఆక్రమణలో ఉన్నాయన్నారు. వారికి ఎటువంటి పాస్‌ పుస్తకాలు రెవెన్యూశాఖ నుంచి ఇవ్వలేదని తెలిపారు. మరోవైపు దేవదాయశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో భూములు రైతుల ఆక్రమణలలోనే ఏళ్ల తరబడి ఉంటున్నాయి.