News

సనాతన ధర్మమంపై యోగి చేసిన వ్యాఖ్యల అర్థం ఇదే.. కానీ కొందరు తప్పుగా వక్రీకరిస్తున్నారు!

315views

సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మండిపడ్డారు. వరుస ప్రశ్నలు సంధించారు. ఇతర ధర్మాల మాటేమిటని యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించారు. అసలు ఇతర మతాలకు చోటుందా? లేదా? సనాతన ధర్మంలో దళితులు, మహిళలకు చోటు ఉంటుందా అని నిలదీశారు.

బౌద్ధమతానికి చెందిన కొందరి నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. ఇతర ధర్మాల సంగతేమిటనే ప్రశ్నకు యోగీ సమాధానం చెప్పాలన్నారు. వీటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరారు. పురాతనకాలం నాటి ధర్మం సనాతన ధర్మం. దానిని నేను గౌరవిస్తాను. సనాతన ధర్మాన్ని నిరాకరించేవారిని ఫూల్స్ అనే చెప్పాలి. నా ప్రశ్న ఒక్కటే. ఇతర మతాల వారికి చోటు ఉందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఉదిత్ రాజ్ అన్నారు.

అసలు యోగి ఏమన్నారంటే?
సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్‌లోని జాలౌర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. బ్రాహ్మణులను, గోవులను పరిరక్షించాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పునఃస్థాపన జరగాలని అన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు. యోగి వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రామ్‌చరిత్ మానస్‌ను నిషేధించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత మౌర్య డిమాండ్ చేయడానికి కౌంటర్‌గానే యోగి తాజా వ్యాఖ్యలు చేసినట్టు వారు భావిస్తున్నారు. అయితే.. యోగీ ఆదిత్యనాథ్‌ కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే వెలువరించారు. సనాతన ధర్మంలో అందరికీ చోటు ఉంటుందనే విషయం తెలియని కొందరు వ్యక్తులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని యూపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.