News

చేతులు కాలినాక.. ఆకులు పట్టుకుంటున్న పాకిస్థాన్‌…? అసలేం జరిగిందంటే!

355views

పాకిస్థాన్‌ దేశం ఏ స్థాయి సంక్షోభంలో ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. మిగిలిన అవసరాలు దేవుడెరుగు. ఇక చేసేందేం లేక.. చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఆ దేశ పరిస్థితి. ప్రస్తుతం పాక్‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమేనని అక్కడి ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తమ పట్ల ఉదారంగా వ్యవహరించేలా చూడాలని అమెరికాను వేడుకున్నారు. వరదలు, ఇతర బాహ్య అంశాలు తమ దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ వివరాలను పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్థిక సాయం కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ డిమాండ్లను ఆ దేశం అంగీకరిస్తే నిత్యావసరాలు, ఇతర ధరలు భారీగా పెరుగుతాయి. ఫలితంగా ఎన్నికల్లో ఇప్పుడున్న అధికారపార్టీకి ఎదురుదెబ్బ తప్పదని భావిస్తోంది. అందుకే ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

ఈక్రమంలో అమెరికా ప్రతినిధి బృందం బుధవారం పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ బృందంతో ఇషాక్ దార్ మాట్లాడుతూ, తమ పట్ల ఐఎంఎఫ్ ఉదారంగా వ్యవహరించేలా చూడాలని కోరారు. వరదలు, ఇతర బాహ్య అంశాలు ఏ విధంగా తమను ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా తాము చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.