
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని భారత్లో బ్లాక్ చేయాలంటూ యూట్యూబ్, ట్విటర్లను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 2002 నాటి గుజరాత్ అల్లర్ల వెనుక అప్పటి సీఎంగా ఉన్న ప్రధాని మోదీ ఉన్నట్లు ఆ డాక్యుమెంటరీ స్పష్టం చేస్తుంది. నిజానికి ఈ కేసులో ప్రధాని మోదీ సహా.. పలువురు బీజేపీ నాయకులకు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ విదేశాంగ శాఖ ఇటీవల ఈ డాక్యుమెంటరీపై కన్నెర్రజేసింది. ‘‘ఇది వలసవాద ధోరణికి నిదర్శనం’’ అంటూ విమర్శించింది. భారత్లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు వ్యక్తులు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ట్విటర్లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్ చేశారు. వాటిని తొలగించాలని, భవిష్యత్లో ఈ వీడియో అప్లోడ్ కాకుండా బ్లాక్ చేయాలని అపూర్వచంద్ర తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021లోని ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించి, ఈ ఆదేశాలను జారీ చేశారు. కాగా.. ఈ డాక్యుమెంటరీపై 302 మంది మాజీ జడ్జిలు, విశ్రాంత బ్యూరోక్రాట్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది భారత్లో హిందూ-ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. విభజించు-పాలించు అనేది బ్రిటిష్ నైజం అయితే.. అందరినీ కలుపుకొనిపోవడం భారత్ నీతి. బీబీసీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని వారు వ్యాఖ్యానించారు.





